విడపనకల్లు మండలం ఎన్. తిమ్మాపురం గ్రామంలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు, వైస్సార్సీపీ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈసందర్భంగా గ్రామంలో ప్రసిద్ద తిమ్మరాయుడు (వేంకటేశ్వరస్వామి) ఆలయంలో స్వామివారిని మాజీ ఎమ్మెల్యే, ఎంపీ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.