తన వ్యాపార సామ్రాజ్య వృద్ధిని ఏ ఒక్క రాజకీయ నాయకుడితోనూ ముడిపెట్టలేమని భారత వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న సంబంధాల వల్ల వ్యాపారంలో లబ్ధి పొందారనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అదానీ గ్రూప్ ప్రయాణం మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభమైందని అదానీ చెప్పారు.
‘ప్రధాని మోదీ, నేను ఒకే రాష్ట్రానికి చెందినవాళ్ళం. అందుకే అలాంటి నిరాధారమైన ఆరోపణలకు నన్ను సులభంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఇలాంటి కథనాలు నాపై మోపడం దురదృష్టకరం’ అని ఓ ఆంగ్ల టీవీకి వచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ అదానీ అన్నారు. తమ గ్రూప్ విజయాన్ని స్వల్పకాలిక దృష్టితో చూసినప్పుడే ఈ ఆరోపణలు వస్తున్నాయని, గిట్టని వాళ్లే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
‘ఏ ఒక్క నాయకుడి వల్లో నా వృత్తిపరమైన విజయం సాధ్యం కాలేదు. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలంలో అనేక మంది నాయకులు, ప్రభుత్వాలు ప్రారంభించిన విధానాలు, సంస్థాగత సంస్కరణలు మా విజయానికి కారణం అయ్యాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో, ఎగ్జిమ్ (ఎగుమతి-దిగుమతి) విధానాన్ని సరళీకరించినప్పుడు ఇదంతా ప్రారంభమైందని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. 1991లో నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం భారీ ఆర్థిక సంస్కరణలను ప్రారంభించినప్పుడు నా రెండో దశ వృద్ధి మొదలైంది. అనేకమంది ఇతర పారిశ్రామికవేత్తల మాదిరిగానే నేను కూడా ఆ సంస్కరణల ద్వారా లబ్ధి పొందాను’ అని అదానీ చెప్పారు.
1995లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన కేశుభాయ్ పటేల్ ఎన్నిక కావడం, ముంద్రాలో తన మొదటి ఓడరేవును నిర్మించడానికి దారితీసిన తీరప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం తన వ్యాపారంలో మూడో మలుపు అని అన్నారు. ‘ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ హయాంలో ఆ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆయన విధానాలు, వాటి అమలు రాష్ట్ర ఆర్థిక రంగాన్ని మార్చడమే కాకుండా.. పరిశ్రమలు, ఉపాధిని కూడా అనుమతించాయి. అది నా వ్యాపార జీవితంలో నాలుగో మలుపు అయింది’ అని అదానీ పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ నుంచి తాను స్పూర్తి పొందానని చెప్పారు. ఇక తన వ్యాపారాలన్నీ వృత్తిపరమైన, సమర్థులైన సీఈవో పర్యవేక్షణలోనే కొనసాగుతాయని, వారి రోజువారీ పనితీరులో తాను జోక్యం చేసుకోనని అదానీ వెల్లడించారు.