వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ కరువైందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ఆరోపించారు. నరసరావుపేటలో ఈ నెల 20న హత్యకు గురైన ఇబ్రహీం కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... మసీదు కట్టకుండా దుకాణాలు కడుతున్నారని కోర్టుకు వెళ్లి స్టే తీసుకువస్తే కక్షకట్టి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఇబ్రహీంను హత్య చేశారని అన్నారు. స్థానిక శాసనసభ్యుడి ప్రోత్సాహంతో ఈ హత్య జరిగిందనే వినికిడి ఉందన్నారు. ఇది వైసీపీ స్పాన్సర్డ్ హత్యగా ముస్లింలు భావిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మాచర్లలో వంద ముస్లిం కుటుంబాలు ఊరినుంచి దూరం చేశారని చెప్పారు. ఈ రోజుకు కూడా వారు మాచర్ల వెళ్ళలేని పరిస్థితి దాపురించిందన్నారు. నంద్యాలలో లేనిపోని కేసులలో ఇరికించి వేధించడంతో సలామ్, కుటుంబసభ్యుల సహా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ముస్లింలపై 47 అత్యాచారాలు, అక్రమ కేసులు, క్షోభకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడే చేసిన ఘటనలు రాష్ట్రంలో జరిగాయన్నారు. మైనారిటీలకు ఎవరికి కూడా ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చినట్లు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, హత్యను ప్రోత్సహించిన వారిపై కూడా కేసుల నమోదు చేసి నిజాయితీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఇబ్రహీం హత్యకేసులో మిగిలిన ఇద్దరిని కూడా అరెస్టు చేయాలన్నారు. పరోక్షంగా ఈ హత్యను ప్రోత్సహించిన వారిని కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారాగాని, నిందితుల ద్వారానైనా ఇప్పించాలని అన్నారు. బాధిత కుంటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. సమావేశంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షుడు మాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మన్నాన్ షరీప్, జిల్లా అధికార ప్రతినిధి రఫీ, ఇబ్రహీం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.