ఇంటర్మీడియెట్ విద్యామండలి తాజాగా విడుదల చేసిన పరీక్షల షెడ్యూలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా తొలుత ప్రాక్టికల్స్, అనంతరం థియరీ పరీక్షలు జరుగుతాయి. కానీ, తొలిసారి ప్రాక్టికల్స్‌ను థియరీ పరీక్షల తర్వాత నిర్వహించబోతున్నారు. మార్చి 15న థియరీ పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి. అనంతరం ఏప్రిల్ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించబోతున్నారు. ఏటా ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చిలో థియరీ పరీక్షలు జరిగేవి. ప్రాక్టికల్స్ ముగిస్తే విద్యార్థులు థియరీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. అవి పూర్తికాగానే ఎంసెట్, జేఈఈ, ఇతర వర్సిటీల ప్రవేశ పరీక్షలకు చదువుకునేందుకు సమయం ఉండేది. కానీ, ఈ ఏడాది ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ నెలాఖరు వరకు ఇంటర్ పరీక్షలతోనే సరిపోతుంది. ఆ తర్వాత మేలో నిర్వహించే ఎంసెట్ సన్నద్ధతకు ఎక్కువ సమయం ఉండదు. అలాగే, జేఈఈ మెయిన్స్ పరీక్షలు మొదటి సెషన్ జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరుగుతాయి. ఈ ఏడాది వాటికోసం చదివే సమయం కూడా విద్యార్థులకు ఎక్కువ ఉండదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కొవిడ్ నేపథ్యంలో గతేడాది కూడా విద్యా సంవత్సరం ఆలస్యంగానే ప్రారంభమైనా ప్రాక్టికల్స్‌ను థియరీ తర్వాతకు మార్చలేదు. సాధారణంగా మేలో జరిగే ఎంసెట్ పరీక్షకు 40రోజులు ముందుగా(మార్చిలోనే) నోటిఫికేషన్ జారీచేస్తారు. ఇంటర్ థియరీ పరీక్షలు ముగిసే సమయంలోనే ఎంసెట్ హడావుడి మొదలవుతుంది. కానీ, ఇప్పుడు విద్యార్థులు ఎంసెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు వీల్లేకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.