ఏ దేశంలోనైనా అరుదైన వాటిని జాతీయ సంపదగా ప్రకటిస్తారు. కానీ, బ్రెజిల్‌లో ఓ ఆటగాడిని జాతీయ సంపదగా ప్రకటించారు. ఆ అరుదైన ఘనతను పీలే 1961లో అందుకొన్నారు. 1958 ప్రపంచకప్ టోర్నీలో పీలే ఆటను చూసిన ఫుట్‌బాల్ క్లబ్ యజమానులు వెర్రెక్కిపోయారు. పీలే అప్పటికే బ్రెజిల్‌లోని శాంటోస్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అతడిని ఎలాగైనా తమ జట్టులోకి తీసుకోవాలని ఐరోపాలోని సంపన్న ఫుట్‌బాల్ క్లబ్‌లు విశ్వ ప్రయత్నాలు చేశాయి. తాము ఏదో ఒకటి చేయకపోతే ఐరోపా ఫుట్‌బాల్ క్లబ్‌లు పీలేను ఎగరేసుకుపోతాయని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన చెందింది. 1961లో నాటి బ్రెజిల్ అధ్యక్షుడు జానియో క్వాడ్రోస్ రంగంలోకి దిగి పీలేను అధికారికంగా ‘జాతీయ సంపద’గా ప్రకటించారు. దీంతో దేశం బయట లీగ్ జట్లకు అతడిని బదలాయించే అవకాశం లేకుండాపోయింది.