నెమలి నాట్యమాడితే ఆనందిస్తాం. మనకు ఆనందాన్ని పంచే ఆ నెమలికే మాయదారి రోగం వచ్చి పడింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గoలోని అటవి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో నెమళ్లు ఉన్నాయి. వాటికి శరీరం సచ్చుబడిపోయి, నోటి నుంచి నురుగు వచ్చి మైదాన ప్రాంతాల్లోకి వచ్చి పడిపోతున్నాయి. వీటిని గమనించిన రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. నెమళ్లకు వస్తున్న రోగాన్ని పరిశీలించిన అటవి శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు. రోగం నుంచి కుదుటపడ్డాక తిరిగి అటవీ ప్రాంతంలోకి వదిలేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుందని మాత్రం అటు అటవీ శాఖ అధికారులు, ఇటు వైద్యులు కూడా గుర్తించడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. కాళ్లు పడిపోయి మైదాన ప్రాంతంలోకి వచ్చే నెమల్లను వేటగాళ్లు గుర్తిస్తే ప్రమాదం పొంచి ఉందని మాయదారి రోగాన్ని గుర్తించి పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అయితే తమ దృష్టికి వచ్చిన నెమళ్లను పట్టణానికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నామని ప్రాణాపాయం ఏమీ లేదని ఫారెస్ట్ రేంజర్ రాంసింగ్ తెలిపారు.