రాయల్ ఎన్‌ఫీల్డ్ దీని రాయల్టీయే వేరు. ఇపుడంటే బుల్లెట్‌లు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. కానీ, ఒకప్పుడు మాత్రం అక్కడొకటి, అక్కడొకటి కనిపించేవి. బుల్లెట్ కనిపిస్తే చాలు జనం చాలా ఆసక్తిగా చూసేవారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్‌పై వస్తే చాలా గొప్పగా భావించేవారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘ఆల్ న్యూ క్లాసిక్’ ఎక్స్ షో రూం ధర ఇప్పుడు రూ. 2.2 లక్షలుగా ఉంది. దీనికి బోల్డన్ని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఒకప్పుడీ బైక్ ధర రూ. 18,700 అన్న సంగతి మీకు తెలుసా?
నమ్మబుద్ధి కావడం లేదు కదూ! అయినా, మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఇందుకు సంబంధించిన బిల్లు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అందులో 23 జనవరి 1986లో కొన్నట్టుగా ఉంది. ఆ బిల్లును చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ సిటీలో ఉన్న సందీప్ ఆటో కంపెనీ 36 సంవత్సరాల క్రితం ఈ బిల్లు జారీ చేసింది. దాంట్లో ఒక బుల్లెట్ అని రాసి ఉంది. ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం ఇండియన్ ఆర్మీ ఎక్కువగా ఉపయోగించేది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బిల్లుకు ఇప్పటి వరకు 53 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఓ యూజర్ స్పందిస్తూ తన వద్ద 1984 నాటి మోడల్ ఉందని, దాని ధర రూ. 16,100 మాత్రమేనని పేర్కొన్నాడు. 38 సంవత్సరాలు అయినా ఇప్పటికీ అది తన వద్ద భద్రంగా ఉందని రాసుకొచ్చాడు. మరో యూజర్ స్పందిస్తూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు కనీసం రూ. 250 రాయితీ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. తాము 1980లో బాంబే (ప్రస్తుతం ముంబై)లోని అలీ భాయ్ ప్రేమ్ జీ డీలర్ వద్ద రూ. 10,500కే బుల్లెట్ కొనుగోలు చేశామని మరో యూజర్ గుర్తు చేసుకున్నాడు.