తాడిపత్రి పట్టణంలోని పురాతన ఆలయమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో జనవరి 2 వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులంతా స్వామి దర్శించుకునేందుకు సర్వము సిద్ధం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బాణానాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 45, 000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారికి వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించేలా కమిటీ సభ్యులు నిర్ణయించారు. గత మూడు సంవత్సరాల నుంచి తిరుమలలో నుండి తెప్పించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా తిరుమల నుంచి లడ్డు తెప్పించి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాకుండా అన్నవరం నుంచి సత్యదేవుని ప్రసాదం భక్తులకు అందజేయడానికి తాడిపత్రి తీసుకొని వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. వైద్య బృందాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు.
తిరుమల నుండి తెప్పించిన లడ్డు ప్రసాదము , అన్నవరం నుంచి తెప్పించిన సత్యదేవుని ప్రసాదము ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం రోజు స్వామివారి చెంతన ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతల వెంకటరమణ స్వామి విగ్రహాన్ని ఆనంద పుష్కరిణి కోనేరులో ఉంచి స్వామివారికి నీటితో నిరంతరం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులతో భక్తి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామి వారి దర్శనానికి గుడి వద్దకు రాలేని భక్తులకు దర్శనం కలిపించడానికి ఉదయం 8: 30 గంటల నుండి గ్రామోత్సవం ఏర్పాటు చేసి కేరళకు చెందిన మంగళ వాయిద్యాలు డప్పుల కళాకారులు కోలాటాల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపును చేపట్టనున్నారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి నిర్వహించడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచనల మేరకు దాతల సహకారంతో భక్తులకు అందరికీ స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ బాణ నాగేశ్వర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మురళి స్వామి , ఈవో సుబ్రహ్మణ్యం , ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు