వైకుంఠ ఏకాదశికి తిరుమల పుణ్యక్షేత్రం ముస్తాబైంది. శ్రీవారి ఆలయ మహద్వార గోపురంతోపాటు ప్రాకారం, ధ్వజస్తంభం, ఉత్తర ద్వారంలో ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు. ఆలయంలో ఐదు టన్నులు, వెలుపల ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలతో అలంకరణలు చేశారు. మరో లక్ష కట్ ఫ్లవర్స్‌తో ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠం, ఉత్తరద్వారాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు. మహద్వారం గోపురానికి శంఖు, చక్ర, నామాల నడుమ పుష్పాలతో తయారుచేసిన మహావిష్ణువు, లక్ష్మీదేవి దేవతామూర్తుల కటౌట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లోని పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి. ఆలయం ముందు ఏర్పాటు చేసిన 'వైకుంఠ మండపం' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీమహావిష్ణువుతోపాటు అష్టలక్ష్మీ, దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు. 30 వేల కట్‌ఫ్లవర్స్‌తోపాటు టన్ను సంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు. ఆలయం ముందు గొల్లమండపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారు, గ్లోబు విద్యుత్ ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.