చీరల పంపిణీ, కానుకల పేరుతో గుంటూరులో సభపెట్టి ముగ్గురు నిరుపేద మహిళల ప్రాణాలను చంద్రబాబు బలితీసుకున్నాడని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందడం బాధాకరమన్నారు. చంద్రబాబు దర్శకత్వంలోనే గుంటూరులో సభ జరిగిందని, తప్పించుకోవడానికి ట్రస్ట్ పేరు చెబుతున్నారన్నారు. కానుకల పేరుతో మహిళలకు ఆశ చూపించారని, కొంతమందికి టోకెన్లు ఇచ్చి, మరికొంతమందికి సభకు వచ్చాక ఇస్తామని నిరుపేద మహిళలకు ఆశచూపించారని, ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఘటన జరిగిందన్నారు. కందుకూరులో 8 మంది ప్రాణాలు బలితీసుకున్న కొద్దిరోజుల్లోనే గుంటూరులో మరో ముగ్గురి మరణాలకు కారణమయ్యారని, గుంటూరులో సభను ఆర్గనైజ్ చేసింది టీడీపీనే అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.