జగనన్న కాలనీల్లో ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో హౌసింగ్‌పై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ ప్రగతిని అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. టిడ్కో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణంకోసం రూ. 6,435 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేసిందని అధికారులు తెలిపారు. అధికారులు క్రమం తప్పకుండా ఆయా లే అవుట్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నారని వెల్లడించారు. డిసెంబర్ నెలలో 4 సార్లు లే అవుట్లను పరిశీలించామని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న అధికారులు. మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారుల వెల్లడి.అన్ని లే అవుట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన ల్యాబులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.