సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి తలపెట్టిన పర్యటనకు ప్రభుత్వం తరఫున అడ్డంకులు మొదలయ్యాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో-1ను చూపిస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మంగళవారం హుటాహుటిన కుప్పానికి చేరుకుని.. టీడీపీ నేతలకు వీటిని అందజేశారు. బుధవారం శాంతిపురం మండలంలో మొదలయ్యే చంద్రబాబు పర్యటన మూడు రోజులపాటు సాగనుంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యా్‌పతో టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. అయితే డీఎస్పీ కుప్పం వచ్చి.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌ను, ఇతర టీడీపీ ముఖ్య నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు సభలు, సమావేశాలు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు ఈ డివిజన్‌లో పోలీసు యాక్టు అమల్లో ఉంటుందన్నారు. గత ఏడాది నవంబరులో డివిజన్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాలమైన ప్రదేశాలను గుర్తించి, తమకు ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకున్నాకే సభలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్న శాంతిపురం ఎన్టీఆర్ విగ్రహం కూడలికి డీఎస్పీ వెళ్లారు. అది జాతీయ రహదారి అయినందున అక్కడ బహిరంగ సభకు అనుమతినివ్వబోమన్నారు. దీనిపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా, శాంతిపురంలో ఎన్టీఆర్ కూడలి వద్దే సభలు సమావేశాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, కొత్తగా ఇదేమి నిర్ణయమని నిలదీశారు. అనుమతి ఇచ్చే అవకాశమే లేదని డీఎస్పీ చెప్పారు. అయితే.. పోలీసు శాఖ నిర్ణయం ఎలా ఉన్నా నియోజకవర్గంలో తన పర్యటన కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి కుప్పం చేరుకుంటారు. ఆయన మూడ్రోజుల పర్యటన కార్యక్రమాన్ని కూడా విడుదల చేశారు.