అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థలతో విద్యుత్తు సంస్థలు చేసుకున్న కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) జగన్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను అమలు చేయాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించిన తర్వాత.. ఆ పీపీఏలను అమలు చేస్తోంది. అదే సమయంలో పీపీఏను అమలు చేయాల్సిన అవసరం రానప్పటికీ హిందూజాతో చేసుకున్న ఒప్పందంపై మాత్రం ప్రభుత్వవర్గాలు ఉత్సాహం చూపుతుండటం గమనార్హం. ఈ ఒప్పందం అమలు భారం దాదాపు రూ.2300 కోట్లు ఉంటుందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా రాష్ట్ర విద్యుత్తు వినియోగదారులు మోయాల్సిందేనని తేల్చేస్తున్నాయి. ఇప్పుడు ఒప్పందాన్ని అమలు చేస్తే రూ.2300 కోట్ల తోనే పోతుందని ..ఇంకా జాప్యం చేస్తే దీని విలువ మూడు రెట్లు అవుతుందంటూ కొత్త సూత్రీకరణను ఇంధనశాఖ తెరపైకి తెస్తోంది. అప్పుడు అది రమారమీ రూ.6900 కోట్లు దాటే ప్రమాదం ఉందని వినియోగదారులను ఏకంగా బెదిరించే ధోరణిని ఇంధన శాఖ ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.