విశాఖ వేదికగా నిర్వహించిన వైజాగ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 5 రాష్ర్టాలకు చెందిన కళాకారులకు అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టంలోనే విశాఖ సినిమా షూటింగ్ లకు ప్రదాన కేంద్రంగా మారిుపోయిందన్నారు. ఇప్పుడు కొత్తగా విశాఖను మరిన్ని సినిమాల చిత్రీకరణకు ఉపయోగించుకోవచ్చునన్నారు.
జాలాది చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో విశాఖ వేధికగా ఐదు రాష్ర్టాలకు చెందిన కళాకారులకు అవార్డులు ప్రధానం చేసుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రస్తుతం సినిమా రంగంలో సక్సస్ రేటు ఐదు శాతం మాత్రమే ఉందన్నారు. గతంలో ఇది ఎనిమిది శాతంగా ఉండేదన్నారు. వంద సినిమాలకు ఐదు సినిమాలు నూరు శాతం సక్స్ స్ ను సాధించడం జరుగుతుందన్నారు. గౌరవ అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం, పలు రాష్ర్టాల నుంచి ముఖ్య కళాకారులు ఇక్కడకు రావడం అభినందనీయమన్నారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో జాలాది విజయ మాట్లాడుతూ తాము సంకల్పించిన ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
అన్ని రాష్ట్రాల నుంచి కళాకారులు రావడం ఇందుకు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ తమకు అండగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. తమ తండ్రి జాలాది ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా పాగల్, రాదేశ్యామ్ తో పాటు తెలుగు, తమిళం, మళయాల, కన్నడ, కర్ణాటకతో పాటు పలు రాష్ర్టాలకు చెందిన సినిమాలకు , టెక్నీషియన్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహాంజలి సంస్థ భారీ ఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఫౌండర్ పులగం రామచంద్రారెడ్డి, కో పౌండర్ జాలాది విజయ, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, సినీ ప్రముఖులు సాయివెంకట్, నరసింగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ తామాడ శ్రీనివాస్, సెన్సార్ బోర్డు మెంబర్ దుర్గాప్రసాద్ ఐనాడ తదితరులు పాల్గొన్నారు.