కరోనా వంటి కొత్త వైరస్ ల నిరోధానికి అవసరమైన పరిశోధనలు వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆధ్వర్యంలో స్థానిక నోవాటెల్ హోటల్ లో మూడు రోజులు పాటు జరిగే 16వ యాన్యువల్ గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. సమ్మిట్ లో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కిందట ఊపిరి పోసుకున్న కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడించిందని, దీనివలన లక్షలాదిమంది చనిపోయారని అన్నారు. ఇటువంటి వ్యాధులు నిరోధానికి అవసరమైన ప్రయోగాలు త్వరితగతిన చేపట్టాలని ఆయన కోరారు. ఇటువంటి సమ్మిట్లలో నిష్ణాతులైన వైద్యుల మధ్య జరిగే చర్చలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు. వీరి సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయన్నారు. కరోనా నాలుగో వేవ్ దూసుకు వస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలు కారణంగా రాష్ట్రంలో కేసులు నమోదు కాలేదని అమర్నాథ్ చెప్పారు. ఈ సమ్మిట్ కి హాజరైన వైద్యులు విశాఖ నగరాన్ని చూసి ముచ్చట పడ్డారని అమర్నాథ్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ ను సమ్మిట్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, డాక్టర్ టి. రవిరాజు, డాక్టర్ టి. రాధ తదితరులు పాల్గొన్నారు.