‘‘అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు, దళారులు, సిఫారసులకు తావులేకుండా కేవలం రాత పరీక్షల్లో సాధించిన ప్రతిభతోనే ఉద్యోగాలు ఇస్తాం. ఇంటర్వ్యూల విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతున్నాం’’- రెండేళ్ల కిందట జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో సీఎం జగన్ చేసిన ప్రకటన ఇది. దీనికి అనుగుణంగా.. గ్రూప్-1తో సహా ఏపీపీఎస్సీ చేపట్టే అన్ని నియామకాలకు ఇంటర్వ్యూలు రద్దుచేస్తూ 2021, జూన్ 26న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే, అటు సీఎం ప్రకటన, ఇటు జీవోలను బుట్టదాఖలు చేస్తూ.. గత ఏడాది సెప్టెంబరు 30న గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ‘గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపిక చేసే అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అన్నిచోట్లా ఇంటర్వ్యూ విధానం అమలవుతోంది. గ్రూప్-1 ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి’ అని జీవోలో స్పష్టం చేసింది. వాస్తవానికి ఏ ఇంటర్వ్యూల వల్ల అవినీతి జరుగుతోందని, పక్షపాతానికి పాల్పడుతున్నారని సీఎం జగన్ గగ్గోలు పెట్టారో, ఇప్పుడు అవే ఇంటర్వ్యూలను ప్రభుత్వం తిరిగి ప్రవేశ పెట్టింది. వాటి ఆధారంగానే ఇప్పుడు గ్రూప్-1 పోస్టుల భర్తీని ప్రారంభించింది. గ్రూప్-1 స్ర్కీనింగ్ పరీక్ష ఆదివారం జరగబోతున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.