వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని చినగొలుగొండపేటలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న తనలాంటి నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నా.. గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇప్పటివరకు నాపై 14 కేసులు పెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.మూడు వేలు పింఛన్ ఇస్తామని, సన్నబియ్యం ఇస్తామని తదితర మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేటికీ ఎన్నో హామీలు నెరవేర్చలేదన్నారు. నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు సంక్రాంతి పండగ చేసుకునే అవకాశం లేదన్నారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు అయ్యన్నపాత్రుడిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు పి.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.