ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ రైల్వేయార్డులో శనివారం జరిగిందీ ఘటన. విజయవాడ రాణిగారితోటకు చెందిన అబ్దుల్ సలాం కానూరు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి. తండ్రి సమీర్ ఆటోనగర్‌లో ఐరన్ స్ర్కాప్ వ్యాపారి. తల్లి తమన్నా న్యూట్రిషన్. సలాంకు ఓ సోదరి కూడా ఉంది. సలాం ఇంటర్మీడియట్‌లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి ప్రస్తుతం తిరుపతిలో బీటెక్ చేస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆమె మరొకరితో ప్రేమలో ఉందని తెలియడంతో సలాం మనోవేదన చెందుతున్నాడు. శనివారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని సుదీర్ఘ లేఖ రాశాడు. తాను ప్రేమించిన యువతి పేరు, ఫోన్ నంబర్, ఆమె ప్రేమిస్తున్న భౌతికశాస్త్రం అధ్యాపకుడి పేరు, ఫోన్ నంబర్ రాశాడు. ఆ అధ్యాపకుడికి ఇప్పటికే వివాహమై ఒక బాబు ఉన్నాడని, అయినా అర్ధరాత్రి వరకు అధ్యాపకుడితో యువతి వీడియో కాల్స్ మాట్లాడుతోందని, ఆ విషయాన్ని ఆయనే తనకు చెప్పాడని లేఖలో వివరించాడు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఐడీలతో మరికొంతమంది యువకులనూ ఆ యువతి ప్రేమ పేరుతో మోసం చేసిందని రాశాడు. ఈ లేఖను ఇంట్లో వదిలి శనివారం మధ్యాహ్నం నేరుగా విజయవాడ రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న రైల్వే యార్డు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచిస్నేహితులకు, తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. తొందరపడొద్దని వారంతా వారించగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాడు. అనంతరం అక్కడి రైలు పట్టాలపై పడుకున్నాడు. గూడ్స్ రైలు అతడి మీద నుంచి వెళ్లడంతో నడుమ వద్ద శరీరం రెండు ముక్కలైంది. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.