రాష్ట్రంలోని అనేక రైతుబజార్లలో దుకాణాల కేటాయింపు అస్తవ్యస్తంగా తయారైంది. అద్దెల ద్వారా ఆదాయం పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని, కొన్ని రైతుబజార్లలో నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా దుకాణాలు కేటాయిస్తున్నారు. చివరికి పార్కింగ్ ప్రదేశాల్లోనూ స్టాల్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. స్టాల్స్ అద్దెలు భారీగా పెంచడంతో చిన్నకారు రైతులు, డ్వాక్రా మహిళలు ముందుకు రాకపోతుండటంతో కొన్ని చోట్ల ఇతర వ్యాపారులకు షాపులిస్తున్నారు. కొన్ని రైతుబజార్లలో అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేసి, వ్యాపారులకు స్టాల్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే అదునుగా మార్కెటింగ్‌శాఖ అధికారులు అమ్యామ్యాలు తీసుకొని స్టాల్స్ కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో 100కుపైగా రైతుబజార్లు ఉండగా, పెద్ద రైతుబజార్లన్నింటిలో ఇదే తంతు సాగుతోంది. ఒక్కో రైతుబజార్‌లో 30 నుంచి 150 దాకా దుకాణాలు ఉండగా.. సగం కూరగాయ రైతులకు, సగం డ్వాక్రా మహిళలకు కేటాయించాల్సి ఉంది. సమీప మండలాల్లో కూరగాయలు పండించే రైతులకు, స్థానిక డ్వాక్రా మహిళలకే స్టాల్స్ కేటాయించాలని ప్రభుత్వం నిబంధన పెట్టినా.. జాయింట్ కలెక్టర్లకు తెలియకుండా జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా స్టాల్స్ కేటాయించేస్తున్నారని సమాచారం. విజయవాడలో ఈ తంతును ఓ జాతీయ పార్టీ నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.