అంతరించిపోతున్న ప్రాచీన సంప్రదాయాలను, సంక్రాంతి విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో కిలోమీటరు పొడవుతో భారీ భోగి దండను తయారుచేశారు. గత ఆరేళ్లుగా ఇక్కడ భోగిదండ తయారు చేస్తున్నారు. 2019లో కిలోమీటరున్నర దండతో రికార్డు సృష్టించారు. తదుపరి కరోనా నేపథ్యంలో రెండేళ్లు సాధారణ దండను తయారుచేశారు. ఈ ఏడాది మహిళలు ఉత్సాహంతో ఉరదాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఈదల శ్రీనివాస్ 6టన్నుల ఆవుపేడను చింతలూరు, గుమ్మిలేరు గ్రామాల నుంచి సేకరించారు. 20రోజులు పాటు 50మంది మహిళలు శ్రమించి ఈ భోగిదండను తయారు చేశారు. భోగిరోజున భారీ ఊరేగింపు నిర్వహించి భోగిమంటలో వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.