అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) ఆధ్వర్యంలో విశాఖ వేదికగా మూడు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఆదివారంతో ముగిసింది. మూడు రోజులుగా వివిధ అంశాలపై చర్చించామని, వాటిని బేరీజు వేసుకుని ప్రధానంగా నాలుగు అంశాలపై తీర్మానించామని సదస్సుకు చైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్ టి. రవిరాజు పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన వైద్యులు మెడికల్ ఎడ్యుకేషన్‌లో సహకారాన్ని అందించడం, అక్కడి స్పెషలిస్టులు, సర్జన్లు ఇక్కడకు వచ్చినప్పుడు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించేందుకు అవకాశం కల్పించడం, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించేలా చూడడం, ఇక్కడ ప్రధాన సమస్యలపై పరిశోధన సాగించేందుకు ఇరువైపులా అవసరమైన సహకారం, అధునాతన సీటీ, ఎకో కార్డియాలజీ, ఎంఆర్‌ఐ వంటి యంత్రాల కొనుగోళ్లతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి సహకరించడంపై తీర్మానాలు చేశామన్నారు. ఈ అంశాలపై కొద్దిరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోనున్నట్టు రవిరాజు వెల్లడించారు. ఈ సదస్సు వల్ల వైద్యరంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక టెక్నాలజీ, రోగుల ప్రధాన సమస్యలపై ఇక్కడి వైద్యులకు అవగాహన ఏర్పడిందన్నారు. తన పేరుతో ఉన్న ‘డాక్టర్ పి.రవిరాజు ఎక్స్‌లెన్స్ అవార్డు’ను ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చేతుల మీదుగా డాక్టర్ చలసాని ప్రసాద్‌కు ప్రదానం చేసినట్టు ఆయన వెల్లడించారు.