చిత్తూరు నగరం మూడో రైల్వే గేటు దగ్గర వాలంటీర్ శరవణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటికి సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 11వ వార్డు జోగులకాలనీకి చెందిన శరవణ వార్డు వాలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. తన దగ్గర వైసీపీ నేతలు అప్పులు తీసుకుని.. తిరిగి ఇవ్వకుండా బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లభ్యమైంది. నగరంలోని రాష్ట్ర మహిళల ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి , ఎమ్మెల్యే అనుచరుడు, వైసీపీ నేత సయ్యద్, మరికొంత మంది తన దగ్గర డబ్బులు తీసుకున్నారని వివరించాడు. తిరిగి ఇవ్వమని అడిగితే ఎమ్మెల్యే మనిషిని అంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు. ఇలాగే అడిగితే కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించారంటూ లేఖలో శరవణ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తాను తీసుకున్న డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తానని తన పేరు మీడియాకు చెప్పొద్దని డైరెక్టర్ అంజలి మృతుడి బంధువులను ప్రాధేయపడింది. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు చిత్తూరులోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టి బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.