శ్మశాన వాటిక అంటే అంటరాని ప్రదేశం కాదని.. అది పవిత్రమైన దేవుని చెంతకు చేరే ప్రదేశమని పేర్కొంటూ ఓ మహిళా వైద్యురాలు తన జన్మదిన వేడుకలను ఏకంగా శ్మశాన వాటికలో నిర్వహించుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని మధుమణి నర్సింగ్‌హోం అధినేత డా.చిత్తలూరి మధుసూదన్‌రావు భార్య డాక్టర్ నాగమణి తన జన్మదిన వేడుకలను ఆదివారం నంద్యాల హిందూ శ్మశానవాటికలో జరుపుకున్నారు. ప్రజల్లో శ్మశానం అంటే అపోహలు, భయాలు పోవాలన్న ఉద్దేశంతోనే ఇలా జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నామన్నారు. ఈ సందర్భంగా 15 మంది శ్మశాన సేవకులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు.