ఇపుడు దేశ వ్యాప్తంగా ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పై చర్చ సాగుతోంది. జోషిమఠ్ టౌన్ ఏటా ఆరున్నర సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోందని మరో కొత్త నివేదిక వెల్లడించింది. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతున్నాయని పేర్కొంది. ఈమేరకు రెండేళ్ల పాటు జరిగిన పరిశోధనలో ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) పరిశోధకులు వెల్లడించారు.
టెక్టానిక్ ప్లేట్ల కదలికల్లో మార్పుల వల్లే జోషిమఠ్ ప్రాంతం కుంగిపోతోందని పరిశోధకులు చెప్పారు. దీంతో ఇళ్లు, రోడ్లు సహా ఇతర కట్టడాలకు పగుళ్లు వస్తున్నాయని వివరించారు. జులై 2020 నుంచి మార్చి 2022 వరకు జోషిమఠ్ ఏరియాకు చెందిన ఉపగ్రహ చిత్రాలను నిశితంగా పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు తెలిపారు.
జోషిమఠ్ లో పగుళ్లు వచ్చిన పలు ఇళ్లు, హోటళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదకరంగా మారిన పలు కట్టడాలను మంగళవారం నిపుణుల బృందం గుర్తించింది. కూల్చివేయాల్సిన నిర్మాణాలకు క్రాస్ మార్క్ చేసింది. వాటి కూల్చివేత పనులు కూడా వెంటనే చేపట్టాల్సి ఉండగా.. స్థానికుల ఆందోళనలతో అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. జోషిమఠ్ లో ప్రస్తుతం సుమారు 700 లకు పైగా కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయని అధికారులు చెప్పారు.
ఆగని స్టోన్ క్రషింగ్..
జోషిమఠ్ లో పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, స్థానికంగా స్టోన్ క్రషింగ్ పనులు మాత్రం ఆగడంలేదు. అర్ధరాత్రి తర్వాత రహస్యంగా పనులు కొనసాగుతున్నట్లు ఎన్ డీటీవీ వీడియో ఫుటేజీని ప్రసారం చేసింది. టౌన్ శివార్లలో బద్రీనాథ్ కు వెళ్లే హైవే పక్కన స్టోన్ క్రషింగ్ కొనసాగుతోందని వెల్లడించింది. బండరాళ్లతో ఈ పనిలో నిమగ్నమైన క్రేన్లను చూపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. 2 గంటల ప్రాంతంలో రహస్యంగా ఈ పనులు చేస్తున్నారని తెలిపింది. ఈ శబ్దాలు దాదాపు కిలోమీటర్ వరకు వినిపిస్తున్నా స్థానిక అధికారులు కానీ ప్రజలు కానీ స్పందించలేదని తెలిపింది. పలు ఇళ్లు, రోడ్లకు పగుళ్లు రావడంతో జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే చేపట్టిన పనులనూ ఆపేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలనూ పట్టించుకోకుండా స్టోన్ క్రషింగ్ పనులు కొనసాగుతుండడం గమనార్హం.