చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడిన కుటుంబాల్లో జగనన్న తోడు పథకం ఆనందాన్ని నింపిందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు జగనన్న తోడు పథకం ద్వారా అందించే రూ.10 వేల వడ్డీలేని రుణం ఒక వరంగా నిలిచిందని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు పథకం అమలు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలోని చిరువ్యాపారుల కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయన్నారు. రూ.10 వేల వడ్డీలేని రుణాలను అందిస్తూ చిరు వ్యాపారులకు, సంప్రదాయ చేతివృత్తుల వారికి ఊతం ఇచ్చారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆ కుటుంబాలకు ఐదుసార్లు జగనన్న తోడు పథకాన్ని అందించారని, నేడు ఆరో విడత అందిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న ఆర్థిక భరోసాతో ఆ కుటుంబాలన్నీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. గతంలో వ్యాపారం కోసం అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని ఇబ్బందులు పడేవారని, వారందరినీ సీఎం వైయస్ జగన్ ఆదుకున్నారన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి హామీలు లేకుండా అడిగిన వెంటనే రూ.10 వేలు అందించేలా చిరువ్యాపారులకు అండగా సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా నిలదొక్కకుంటున్నాయన్నారు.