ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తే ఓటమి తప్పదనే భయంతోనే వైసీపీ ప్రభుత్వం చీకటి జీవోలు తీసుకు వస్తున్నదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబరు-1ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండల కేంద్రంలో అఖిలపక్ష నేతలు మంగళవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళితే ప్రభుత్వ వైఫల్యాలు తెలిసిపోయి వైసీపీని తరిమికొడతారనే భయంతోనే సభలు, సమావేశాలు నిర్వహించకుండా జీవో నంబర్-1ను తీసుకు వచ్చారన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఇప్పటికే అధికార పార్టీని ఇంటికి పంపేందుకు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ హక్కులను కాలరాసేలా చట్టాలను చేస్తే ఎవరు సహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన చీకటి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సాగిన బుజ్జిబాబు, సీపీఎం నేత ఎస్.సూరిబాబు, టీడీపీ నాయకులు మాకాడ సత్యనారాయణ, పీట సుధీర్, కుమార్, చిన్నరాజా తదితరులు పాల్గొన్నారు.