ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 108 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు జిల్లా అధ్యక్షుడు టి.శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కాలం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి మాట్లాడారు. 108 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఆ తర్వాత దానిని విస్మరించారన్నారు. 108 ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఉద్యోగ భద్రత కరువవడంతో సిబ్బంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం సత్వరమే 108 సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు ప్రతినెలా వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఉద్యోగులను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా నెల్లూరు బస్టాండు, తిరిగి అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 108 ఉద్యోగులు పాల్గొన్నారు.