కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బుధవారం విజయవాడ కోర్టులో హాజరయ్యారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద చేసిన ధర్నాకు సంబంధించి నమోదైన కేసులో న్యాయస్థానానికి వచ్చారు. 2015లో కడప జిల్లా తొండూరు మండలంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో అరుణకాంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వీరచంద్రరెడ్డి, చెన్నకేశవరెడ్డి అనే నలుగురు కర్ణాటకలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వేధింపుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నారంటూ వారి మృతదేహాలతో ఎంపీ అవినాశ్‌రెడ్డి, వివేకానందరెడ్డి తదితరులు తొండూరు పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి సంబంధించి 2015 లో పోలీసులు మొత్తం 94 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఏ-2గా వైఎస్ వివేకానందరెడ్డిని చేర్చారు. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో శివశంకర్‌రెడ్డి వివేకా హత్య కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ను జైలు సిబ్బంది ఎస్కార్ట్‌తో విజయవాడకు తీసుకొచ్చారు. కేసు విచారణను న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు అవినాశ్‌రెడ్డి తదితరులను మీడియా వీడియో తీస్తుండగా అనుచర వర్గం అడ్డుకుంది. సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండగా వాటినీ లాక్కునేందుకు ప్రయత్నించారు.