కొఠియా వివాదస్పద గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఎటుచూసినా ఆ రాష్ట్ర కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలే కనిపిస్తుండగా ఏపీకి చెందినవి లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. కొఠియా , ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర, పట్టుచెన్నారు, పగులుచెన్నారు, మూలతాడివలస, నేరేళ్లవలస తదితర గ్రామాల్లో ఒడిశాకు చెందిన కార్యాలయాలు, పక్కా పాఠశాల భవనాలు ఉన్నాయి. కొఠియాలో పోలీస్‌స్టేషన్, ఆసుపత్రి, పంచాయతీ కార్యాలయం, ఆశ్రమ పాఠశాల, వివిధ ప్రభుత్వ కార్యాలయ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలున్నాయి. ఏపీ పంచాయతీ కేంద్రమైన ఎగువగంజాయిభద్రలో పంచాయతీ కార్యాలయానికి అద్దె భవనం సైతం లేదు. గంజాయిభద్ర గ్రామ సచివాలయం ప్రస్తుతం నేరేళ్లవలసలో నిర్వహిస్తున్నారు. దీనికి సైతం పక్కాభవనం లేదు. కీలకమైన కొఠియాలో కూడా ఎటువంటి ప్రభుత్వ భవనం లేదు. కొన్నిచోట్ల దశాబ్దాలుగా భవన నిర్మాణాలు పూర్తికావడం లేదు. కొఠియా విషయమై ఒడిశా చొచ్చుకొస్తున్న తరుణంలో ఆయా గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టాల్సిన అవశ్యతను ఏపీ ప్రభుత్వం, అధికారులు గుర్తించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.