విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 166 ఆలయాల నిర్మాణానికి 16.6 కోట్లు మంజూరైనట్టు దేవదాయ శాఖ కార్యనిర్వహక ఇంజినీర్ సీహెచ్ వెంకటరమణ తెలిపారు. చీపురుపల్లిలో దేవాలయాల పరిశీలనకు బుధవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాలయాల నిర్మాణాలకు టీటీడీ ఈ నిధులు సమకూరుస్తోందన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కుటుంబాలు నివాసమున్న ప్రాంతాల్లో ఈ ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షలు వంతున విడుదల చేస్తుందని చెప్పారు. ఈ మొత్తంలో రూ.8 లక్షలు ఆలయ నిర్మాణానికి, రెండు లక్షలు విగ్రహాల కోసం కేటాయిస్తున్నట్లు వివరించారు. గ్రామస్థులు, దాతల సహకారంతో ఇప్పటికే పనులు ప్రారంభమైన ఆలయాలకు కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. పనుల్ని అంచనా వేసి మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పారు. నిర్మాణాల పర్యవేక్షణ కోసం 40 ఆలయాలకు ఒకరిని కాంట్రాక్టు పద్ధతిపై ఇంజినీర్లను నియమిస్తామన్నారు. నెలరోజుల్లో పనులు ప్రారంభించి 11 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో దేవదాయ శాఖ అధికారులు పీవీ లక్ష్మి, ఇప్పిలి అనంతం, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.