తేజస్వి మినహా మరో డిప్యూటీకి అవకాశం లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇదిలావుంటే బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎంగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. మరోవైపు రెండో డిప్యూటీ సీఎంను నితీశ్ కుమార్ తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నితీశ్ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తేజస్వి మినహా మరో డిప్యూటీకి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే మంత్రి వర్గంలోకి ఆర్జీడీ, కాంగ్రెస్ ల నుంచి మరికొందరిని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. తమ సంకీర్ణ ప్రభుత్వంలో ఏడు పార్టీలు ఉన్నాయని... ఏయే పార్టీకి ఎన్ని పదవులు అనే విషయంలో తొలి నుంచే ఒక పక్కా క్లారిటీ ఉందని తెలిపారు. ఏ పార్టీ మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయో వాటిని వారితోనే భర్తీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మరిన్ని పదవులు ఇవ్వాల్సి ఉందని అన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు, జేడీయూకి 45, కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.