టీడీపీ హయాంలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా, హిరమండలం మండలం లోకొండ పంచాయతీ గొడియాపడు గ్రామంలో పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకటరమణతో కలిసి ఆయన పర్యటించారు. గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకొండ పంచాయతీ పరిధిలోని గొడియాపాడు, తాళ్ళపాడు, పూలకొండ, సింగుపురం గ్రామాలకు చెందిన సుమారు 150 గిరిజన కుటుంబాలు టీడీపీలో చేరాయి. కొన్నేళ్లుగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్య పరిష్కారంతో పాటు మూతబడిన ప్రభుత్వ పాఠశాలను తెరిపించేందుకు కృషిచేసిన కలమట వెంకటరమణ, జడ్పీటీసి బుచ్చిబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. టీడీపీలో చేరుతున్నామని గిరిజనులు వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘గిరిజన గ్రామాలకు రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయం, పాఠశాలలు ఏర్పాటుచేసి వారి అభివృద్ధి కృషి చేసింది టీడీపీయే. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ఐటీడీఏ ఏర్పాటు చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. ట్రైకార్ రుణాలు అందజేశాం. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం.. గిరిజన గ్రామాలను విస్మరిస్తోంది. నిధులు లేక ఐటీడీఏ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతులై.. సైకో పాలనకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉంద’ని తెలిపారు.