‘నన్ను నమ్మి అధికారం ఇవ్వండి. అది జనసేన ప్రభుత్వమైనా, మిశ్రమ ప్రభుత్వమైనా అభివృద్ధి పూచీ నాది. పది లక్షల ఎకరాలకు అవసరమైన నిధులు ఇస్తా’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర పోరాటాలగడ్డ అని.. గిడుగు రామ్మూర్తి, వీర గున్నమ్మలే తనకు స్ఫూర్తి అన్నారు. గురువారం లావేరు మండలం సుభద్రాపురం వద్ద నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... జనసేన అధికారంలోకి వస్తే పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై సేఫ్టీ ఆడిట్ చేయిస్తామన్నారు. అలాగే మత్స్యకారులు ఈ ప్రాంతం వదిలివెళ్లకుండా ఇక్కడే ఫిషింగ్ హార్బర్‌లు, జెట్టీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు నిరోధించి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా అనధికార మైనింగ్‌ను అడ్డుకుని శిక్షలు వేస్తామని.. వైసీపీ కార్యాలయంగా మారిన ఆంధ్రా యూనివర్శిటీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను నాగావళి, వంశధార నదులకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. గుంతల రోడ్లను బాగు చేయిస్తామని, గిరిజన యువకులు గంజాయి సాగుపై వెళ్లకుండా వారిలో మార్పు తెచ్చి ఇతర రంగాలవైపు మళ్లిస్తామని చెప్పారు. తనను నమ్మి అధికారం అప్పగించాలని కోరారు. పంచాయతీలకు నిధులు పుష్కలంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని, జనసేన ప్రభుత్వమయినా.. మిశ్రమ ప్రభుత్వమయినా ఇదే రీతిలో వ్యవహరిస్తానని చెప్పారు. వైసీపీ వాళ్లు కేసులు పెడితే భయపడొద్దని.. తాను అన్నింటికీ ముందుంటానని భరోసా ఇచ్చారు. ‘సీఎం సీఎం పవర్‌స్టార్’ అని యవకులు అరవడంతో.. ఇక్కడేమో సింహాల మాదిరిగా అరుస్తారని.. అక్కడేమో గ్రామసింహాలతో పాలన ఉంటుందని.. ఇకనైనా మార్పుజరగాలని.. లేకుంటే భవిష్యత్ ఉండదని చెప్పారు. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు నువ్వలరేవు గ్రామానికి చెందిన యువకుడు మువ్వల నగేష్ ఏడాది క్రితం అనుమానాస్పదంగా మృతిచెందాడని, అధికారంలోకి వస్తే.. నగేష్ మృతికి కారుకులకు శిక్ష పడేలా తక్షణ చర్య ఉంటుందని అన్నారు.