ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నవరత్నాల పథకాలు అర్హులందరికీ అందుతున్నాయి. అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో ఉండేలా సీఎం వైయస్ జగన్ పాలన ఉందన్నారు. కిడ్నీ బాధితుల కోసం పలాసలోనే ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని, బాధితుల చికిత్స కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి అనేది మా ప్రభుత్వం నిర్ణయం అన్నారు. పెట్టుబడులన్నీ అమరావతిలోనే పెడతామంటే మిగతా ప్రాంతాలు ఒప్పుకోవు. అమరావతిలో రాజధాని అనేది కొద్ది మంది రియల్టర్ల కోసమేనని తెలిపారు. శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం ఇంకెన్నాళ్లు నష్టపోవాలని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ఏం చేయాలో పవన్ సూచించాలన్నారు. ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్‌కు ఇష్టం లేదా? అని నిలదీశారు. పవన్ మాటలకు చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. మా ప్రాంతానికి వచ్చి మమ్మల్నే విమర్శిస్తారా అని దుయ్యబట్టారు. విశాఖ రాజధాని వద్దని కొద్ది మంది రియల్టర్ల వైపున ఉంటారా. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాం. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం సీఎం వైయస్ జగన్ తీసుకున్నారని తెలిపారు. విశాఖపట్నం రాజధానితో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.