నాకు జీతం పెంచండి మహాప్రభో అని కోరే వారిని చూసివుంటాం. కానీ తగ్గించమని కోరేవారిని ఎవరైనా చూశారా...? బడా కంపెనీల్లో పని చేసేవారికి ఆ స్థాయిలోనే జీతాలు వస్తుంటాయి. సీఈఓల జీతాలైతే వందలు, వేల కోట్లలో ఉంటాయి. సాధారణంగా ఏ సీఈఓ అయినా తన జీతాన్ని ప్రతీఏటా పెంచుకోవాలని చూస్తుంటారు. కానీ, టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ మాత్రం తన వేతన ప్యాకేజీ చాలా ఎక్కువగా ఉందని భావించారు. తన జీతాన్ని తగ్గించాలన్నారు. దాంతో, ఆపిల్ కంపెనీ ఆయన వేతన ప్యాకేజీని దాదాపు 50 శాతం కోత పెట్టింది. సవరించిన తర్వాత కుక్ జీతం మొత్తంగా 49 మిలియన్ డాలర్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో 3 మిలియన్లు మూల వేతనం కాగా, 6 మిలియన్లు బోనస్, మరో 40 మిలియన్ల ఈక్విటీ లభిస్తుంది.
షేర్ హోల్డర్ ఫీడ్ బ్యాక్, ఆపిల్ అసాధారణ పనితీరు, కుక్ నుంచి వచ్చిన సిఫార్సు కారణంగా కంపెనీ ఆయన జీతాన్ని సవరించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2022లో కుక్ 99.4 మిలియన్ డాలర్ల జీతం అందుకున్నారు. ఇందులో మూల వేతనం 3 మిలియన్లు, బోనస్, స్టాక్‌ల రూపంలో దాదాపు 83 మిలియన్లు ఉన్నాయి. కుక్ 2011లో ఆపిల్ సీఈఓ అయ్యారు. కంపెనీని నిలకడగా విజయపథంలో నడిపిస్తున్నారు.