‘తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆంధ్రాలో అమలవుతున్నాయా? ఇక్కడున్న రోడ్లు అక్కడున్నాయా? తాగు నీటి సౌకర్యం ఉందా? నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతోందా? ఆలోచించండి.. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రజలే సాక్ష్యం’ అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్‌ఎస్ సభను విజయవంతం చేయాలని కోరారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు శనివారం నుంచి ఖమ్మంలోనే ఉండి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్.. దేశానికి అవసరమని అన్నారు. దేశాభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.