ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ లో ముంబై యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ టోర్నీలో పరుగుల మోత మోగిస్తున్నాడు. అయినప్పటికీ అతనికి భారత జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. దీంతో, అతని అభిమానులు, విశ్లేషకులు జట్టు ఎంపికను, సెలెక్టర్ల తీరును తప్పుబడుతున్నారు.
ముంబై రన్నరప్‌గా నిలిచిన రంజీ ట్రోఫీ యొక్క 2021-22 ఎడిషన్‌లో సర్ఫరాజ్ నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ టోర్నీలో అతను 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలోనూ అతను ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్ ల్లో సర్ఫరాజ్ 107.75 సగటుతో 431 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది.
25 ఏళ్ల సర్ఫరాజ్ 2014లో ఫస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఆడిన 36 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 12 సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలతో 80.47 సగటుతో 3380 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతనికి భారత టెస్టు జట్టులో చోటు ఇవ్వకపోవడంపై అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా సర్ఫరాజ్‌ను ఎంపిక చేయనందుకు అసహనం వ్యక్తం చేశాడు.