సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరి పుంగనూరులో నాపై పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తాను పుంగనూరు, కుప్పం రెండు చోట్లా పోటీ చేస్తానని తెలిపారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
పండగ పూట చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపకుండా తమపై పడి ఏడుస్తున్నాడని విమర్శించారు. ఇవాళ చంద్రబాబు పీలేరు సబ్ జైలులో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డిపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దాంతో పెద్దిరెడ్డి కూడా అదేస్థాయిలో బదులిచ్చారు.
తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నీ మాదిరే రాధాకృష్ణ, రామోజీరావు వంటి వారి కోసం పనిచేయడంలేదని చంద్రబాబును విమర్శించారు. తాము బయటికి వెళితే వేలమంది వస్తుంటారని, కానీ ఇవాళ్టి చంద్రబాబు కార్యక్రమానికి వందల సంఖ్యలోనే వచ్చారని, ఆ మాత్రానికే చంద్రబాబు అదుపుతప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ముదిరిపోయిందని, చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. జగన్ వంటి కొడుకు లేడని చంద్రబాబు కుళ్లుకుంటున్నాడని వ్యాఖ్యానించారు.