దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తిప్పికొట్టారు. మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దావోస్ సదస్సులో పాల్గొనాలంటూ నవంబర్ 25వ తేదీనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందిందని అందుకు సంబంధించిన లేఖ ప్రతిని మీడియా ముందుంచారు. గత ఏడాది దావోస్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగంలో తీసుకువస్తున్న సంస్కరణల గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ గురించి కూడా వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించిన తీరుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారని ఆయన చెప్పారు.
ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన నేపథ్యంలోనే దావోస్ సదస్సుకు వెళ్లలేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
దావోస్ వెళ్లి తాను చాలా ఘనత సాధించానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడును ఆ సదస్సులో మాట్లాడమని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. మన రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా మాట్లాడుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మన గురించి మనమే మాట్లాడుకోవాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన. దావోస్ సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేతలను కలిశానని, ఆంధ్రప్రదేశ్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తోందని చంద్రబాబు నాయుడు ప్రకటించిన మరుక్షణమే తాము ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేయడం లేదని ఆ సంస్థ అధినేతలు చెప్పటం ఎంత సిగ్గుచేటని అమర్నాథ్ ప్రశ్నించారు.
దావోస్ సదస్సు గురించి విజయవాడ దావూద్ ఇబ్రహీం మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. అనేక రకాల కేసులతో సంబంధం ఉన్న మాజీ మంత్రి తమ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదని అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై లోకేష్ శ్వేత పత్రం కోరడం దూరంగా విడ్డూరంగా మంత్రి అమర్నాథ్ అన్నారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే తీసుకువచ్చారని, కరోనా పరిస్థితులను కూడా తట్టుకొని జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఆయన వివరించారు.