ప్రజలంతా ఏకమై అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, కేంద్రం మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ కుటుంబ అవినీతి పాలనతో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని విమర్శించారు. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.