రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ప్రశంసలు కురిపించాడు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ సహా మరిన్ని విపక్ష పార్టీలలోని నేతలు కొందరు ‘పప్పు’ అని అంటుంటారు. రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదని, ఇన్నేళ్లు వచ్చినా తల్లి చాటు బిడ్డే అంటూ ఎద్దేవా చేస్తుంటారు. అయితే అవన్నీ అవాస్తవమని, రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదని, వాస్తవానికి చాలా తెలివైన వ్యక్తని భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. నెల రోజుల క్రితం రాహుల్‌తో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు.
‘‘వాస్తవానికి దురదృష్టవశాత్తూ అతడికి (రాహుల్ గాంధీ) అలాంటి పేరు వచ్చింది. కానీ గత పదేళ్లుగా నేను అతడితో మాట్లాడుతూనే ఉన్నాను. కొంత మంది అంటున్నట్లు అతడేమీ పప్పు కాదు. అతడు చాలా తెలివైన వ్యక్తి. యువరక్తం ఉన్నవాడు, అలాగే ఎంతో ఉత్సాహంతో, ఆశతో ఉండే వ్యక్తి. తనను తాను మలుచుకోవడానికి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. సమాజంలో ఏది ప్రధాన్యమో, ఏది అప్రాధాన్యమో అతడికి బాగా తెలుసు. అతడు చేస్తున్న పనికి సరైన వ్యక్తి’’ అని రఘురాం రాజన్ అన్నారు.
నరేంద్రమోదీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించిన రఘురాం రాజన్.. రాహుల్ గాంధీపై పలు సందర్భాల్లో సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా తాజాగా భారత్ జోడో యాత్రలో సైతం పాల్గొనడంతో ఆయన తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘భారత్ జోడో యాత్రలో నేను చేరింది, ఆ యాత్రలోని విలువలేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే. అంతే కానీ నేనే రాజకీయ పార్టీలో చేరట్లేదు. అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు’’ అని అన్నారు.