ప్రకాశం జిల్లా, బల్లికురవ మండల కేంద్రంలో అర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఉన్న భవనాన్ని చెక్కుచెదరకుండా వెనక్కు జరిపే పనులు బుధవారం ప్రారంభం అయ్యాయి. బల్లికురవకు చెందిన షేక్ ఖాదర్ అనే వ్యాపారి రూ. 60 లక్షల విలువ చేసే భవనాన్ని అర్‌అండ్‌బీ రోడ్డులో నిర్మాణం చేయగా ఇటీవల అధికారులు భవనం రోడ్డులో ఉంది కూల్చి వేయాలని నోటీసు ఇవ్వటంతో వెంటనే వ్యాపారి విజయవాడకు చెందిన జేజే బిల్డింగ్ లిఫ్టింగ్ సర్వీసు వారిని సంప్రదించి తన భవనాన్ని వెనక్కి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. గత పది రోజుల నుంచి భవనం చుట్టూతా 90 జాకీలు ఏర్పాటు చేసి వెనక్కి పెట్టే పనులు ప్రారంభించారు. విజయవాడ నుంచి వచ్చిన 15 మంది శిక్షణ పొందిన కార్మికులు భవనం కదిలించే పనులు మెదలు పెట్టారు. రోజుకు అయిదు అడుగుల చొప్పున అయిదు రోజులలో 25 అడుగుల వరకు భవనం కదిలిస్తామని భవన యజమాని తెలిపారు. భవనం పడవేయకుండా వెనక్కి పెడుతున్నారని ప్రజలకు తెలియగానే పెద్ద ఎత్తున బల్లికురవ వచ్చి భవనం కదలిస్తున్న దృశ్యాలను చూసి వెళుతున్నారు. ఎలాంటి నష్టం జరగకుండా భవనం కదిలిస్తుండటంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. భవనం కదలించేందుకు అడుగుకు రూ. 550 వరకు సంబంధిత కాంట్రాక్టరు తీసుకొంటున్నాడని యజమాని ఖాదర్ తెలిపారు.