తిరుమల వేంకటేశ్వరస్వామి మాతృమూర్తి వకుళమాత ఆలయంలో చోరీకి దొంగలు యత్నించారు.తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై ఉన్న ఈ ఆలయం వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు, ఎం.ఆర్. పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ చొప్పున ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తుంటారు. కొండపై ఆలయం ఉండగా సెక్యూరిటీ పాయింట్ కొండకింద ఉంటుంది. సెక్యూరిటీ పాయింట్‌లోనే ఆలయంలోని సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఆలయంలోని ఓ సీసీ కెమెరా స్థానంతప్పి ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి హుటాహుటిన కొండపైకి చేరుకున్నారు. ఐతే అప్పటికే దొంగ అక్కడినుంచి పరారయ్యాడు. ఆలయ గ్రిల్స్ తాళాలు పగులగొట్టి ఉండటం, హుండీ ధ్వంసమై ఉండటంతో చోరీకి విఫలయత్నం జరిగిట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి కొండపై ఆలయంలోకి చేరుకుని ఇనుప రాడ్డుతో ఆలయ తాళాలు పగులగొట్టడంతోపాటు సీసీ కెమెరాను మరోవైపుకు తిప్పివేస్తున్న దృశ్యాలను పోలీసులు సీసీ పుటేజీలో కనుగొన్నారు.ఘటనపై సమాచారం అందుకున్న ఎంఆర్ పల్లె పోలీసులు, టీటీడీ విజిలెన్స్, క్లూస్ టీం ఆలయంలో చోరీకి సంబంధించిన పలు ఆధారాలను సేకరించారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఆర్ పల్లె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐతే ఆలయంలో నగదు, వస్తువులు చోరీకి గురికాకపోవడంతో ఐసీపీ 457, 380, రెడ్‌విత్ 511 సెక్షన్ల మేరకు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించినట్టు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు అశోక్ కుమార్ పరిశీలించారు.