టీడీపీ యువ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టబోతున్న పాదయాత్రపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సంక్రాంతికి స్వగ్రామం వెళ్లి తిరిగి వచ్చిన ఆయన బుధవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, పార్టీ నేతలు టీడీ జనార్దన్, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. యువ గళం పేరుతో ఈ నెల 27 నుంచి లోకేశ్ తన పాదయాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. పాదయాత్ర నిర్వహణ, దానిని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వపరంగా ఏర్పడే ఆటంకాలు వంటి వాటిని ఇందులో చర్చించారు. ఈ పాదయాత్ర వ్యూహాత్మకంగా కీలకమైందని, దీనిని విజయవంతం చేయడానికి మొత్తం పార్టీ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలు, అన్ని నియోజకవర్గాల బాధ్యులు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ యాత్రపై పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసే నిమిత్తం గురువారం ఆయన కింది స్థాయి వరకూ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వర్తమాన రాజకీయాలు, వివిధ అంశాలకు సంబంధించి పార్టీ కమిటీల పనితీరు వంటివి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.