కర్నూలు జిల్లాలో పత్తి, మిరప పంటలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమైంది. దీంతో.. ఊళ్లకు ఊళ్లే వలసబాట పట్టాయి. కోసిగి మండలం నుంచి బుధవారం ఒక్క రోజే దాదాపు పది వేల మంది కూలీలు వలస వెళ్లారు. కోసిగితో పాటు ఆర్లబండ, సజ్జలగూడెం, కందుకూరు, కోల్‌మాన్‌పేట, కామన్‌దొడ్డి, దుద్ది, చిర్తనకల్, సాతనూరు, అగసనూరు తదితర గ్రామాల నుంచి ఊళ్లన్నీ వలసబాట పట్టాయి. బాగా పేరున్న రైతులు సైతం వలసబాట పట్టారు. ఈ ఏడాది కరువు విలయతాండవం చేయడంతో వలసలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.