కాకినాడ సాగరతీరం సూర్యారావుపేట నావెల్ ఎన్‌క్లేవ్‌లో భారత తూర్పు నావికా దళం, ఆర్మీల సంయుక్తంగా నిర్వహిస్తోన్న సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సముద్ర తీరంలో యుద్ధం, తుపాన్లు, విపత్తు, ఆపద సమయాల్లో సముద్రం, ఆకాశయానం నుంచి ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తారు. యుద్ధ సమయంలో శుత్రుదేశాలపై త్రివిధ దళాలు నిర్వహించే ఎదురుదాడి వంటి వాటిపై గత రెండు రోజులుగా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట బీచ్‌లో సైనికా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. భారత నౌకాదళం, ఆర్మీల సంయుక్త ఆధ్వర్యంలో ఆంపీబీయాస్ పేరుతో నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ ఎస్ ఇలాక్కియా, అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్‌లు తిలకించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలు నిర్వహిస్తున్న విన్యాసాలను కలెక్టర్ తిలకించారు. ముఖ్యంగా యుద్ధం సమయంలో జరిపే దాడులు, ఆయుధాల పనితీరు, యుద్ధ ట్యాంకులు, నౌకలు, ప్యారాషూట్, హెలికాప్టర్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విన్యాసాల వివరాలను త్రివిధ దళాల ఉన్నతాధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. యాంపీబీఎస్ విన్యాసాలు ఈనెల 17 నుంచి 22 వరకు జరుగుతాయని సైనిక అధికారులు తెలిపారు.