గత ప్రభుత్వ విధానాలను ఒకప్పుడు విమర్శించిన నోటితోనే మాట మార్చి అవన్నీ తమ ఘనతే అన్నట్టుగా సొంత ఖాతాలో వేసుకోవడం.. అధికార పార్టీ వైసీపీ వ్యవహార శైలి ఇలాగే ఉంది. కియ కార్ల కంపెనీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియ కార్ల తయారీ సంస్థ ప్లాంటును నెలకొల్పగా.. అప్పట్లో విజయసాయి విమర్శించారు. ‘కార్లు అమ్ముడుపోని కారణంగా కియ మోటార్స్ చైనాలోని అతిపెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపురంలో ఏర్పాటవుతున్న ప్లాంటు సంగతేమిటో? కమీషన్ల కక్కుర్తితో కియ మోటార్స్‌కు చంద్రబాబు రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వంద మందికి మించి లేరు’ అంటూ 2019 మార్చి 11న విజయసాయి ట్వీట్ చేశారు. సీన్ కట్ చేస్తే... ఇప్పుడు రాష్ట్రంలో హ్యూండయ్‌ను పక్కకు నెట్టి కియ హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు విజయసాయి కూడా మాట మార్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ కియ కార్, ఇండియన్ కియ కార్ 2023 ‘కార్ ఆఫ్ ద ఇయర్’ గెలుచుకోవడం గర్వకారణం’’ అంటూ తాజాగా శుక్రవారం ట్విటర్‌లో ప్రశంసించారు.