కమ్యూనిస్టు యోధుడు ఏపీ సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి రామయ్య సీఎంను కలిశారు. జగన్ రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి.. పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారని ప్రశంసించారు. 2024లో మళ్లీ అధికారంలోకి రాగానే పేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయాలని రామయ్య కోరారు.
అలాగే రాష్ట్రంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను మెరుగు పరిచేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని.. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. జగన్‌ను కలవటంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. సీఎం చేపట్టిన కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించడానికే వచ్చాను అన్నారు.
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సీపీఎం ఆశయాలకు కట్టుబడి పని చేశాను అన్నారు. తాను తుది శ్వాస వరకు అలాగే ఉంటానని.. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశానన్నారు. తాను జన్మించిన కొంతసేపటికే పోషకాహార లోపంతో తన తల్లి కన్నుమూసిందన్నారు. అప్పుడే మంచి పాలన ఉంటే.. ప్రభుత్వం పోషకాహారం అందజేసి ఉంటే తన తల్లి బతికి ఉండేది అన్నారు. ఉద్యమాలే ఊపిరిగా బతికిన రామయ్య.. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో సాధారణ జీవితం గడుపుతున్నారు.
నెల్లూరు జిల్లాలోని జలదంకి మండలం జమ్మలపాలెంలో అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో 1941 అక్టోబర్ 9న పాటూరు రామయ్య జన్మించారు. బతుకుదెరువు కోసం కూలిపనులకు వెళ్లేవారు. ప్రజా సేవకు అడ్డొస్తారని భార్య అనుమతితో బిడ్డలనే వద్దునుకున్నారు. ఆయన కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు సీపీఎం తరుఫున రామయ్య ఎమ్మెల్యేాగ గెలిచారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఇంటి స్థలాలు కల్పించారు రామయ్య. ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నా సరే తనకంటూ ఒక్క సెంటు స్థలాన్నీ, నివసించేందుకు కనీసం ఒక పూరింటిని కూడా సంపాదించుకోలేదు. ఆయన గతంలో పేద ప్రజలకు జగన్ సర్కారు ఇస్తున్న ఒక సెంటు స్థలాన్ని తనకు కూడా కేటాయించాలని కోరారు. అక్కడ గుడిసె వేసుకుని జీవిత చరమాంకంలో రాష్ట్రంలోనే ఉండిపోతాను అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సరే.. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు రామయ్య.