చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంతూరు.. కార్వేటినగరం మండలం అన్నూరు గ్రామ పంచాయతీకి చెందిన వైసీపీ ఎంపీటీసీ పొన్నుస్వామి శనివారం రాజీనామా చేశారు. పార్టీలో కనీస గౌరవం దక్కకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు మంత్రి నారాయణస్వామి చిన్నాన్న కావడం గమనార్హం!. ఈ సందర్భంగా పొన్నుస్వామి మీడియాతో మాట్లాడుతూ ‘నా సెగ్మెంట్‌లో రెండు పంచాయతీలున్నాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సహకారంతోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఆయన నాకు చిన్నాన్న అవుతారు. ఆయన ఆదరించాడని, ఎంపీటీసీ పదవి వచ్చేలా చేశాడని విలువ ఇవ్వకుంటే ఎలా? నా సెగ్మెంట్ పరిధిలోని 79 మందికి సుమారు ఏడాది కిందట ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంతవరకు వారికి స్థలం చూపించలేదు. నా సెగ్మెంట్ పరిధిలో ఓ ఫ్యాక్టరీ ప్రారంభం కానున్న విషయం కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఇక నాకు విలువేముంది? సమస్యలు చెప్పుకునేందుకు వెళితే.. విని పరిష్కరించే నాయకులు మండలం నుంచి జిల్లా వరకు ఏ స్థాయిలోనూ లేరు. అలంకారప్రాయంగా ఉండే ఈ పదవి నాకు వద్దు. అందుకే రాజీనామా ప్రకటించాను’ అని వివరించారు. రాజీనామా చేస్తున్నట్లు 15 రోజుల కిందటే స్టేటస్ పెట్టుకున్నా ఎవ్వరూ స్పందించలేదని పొన్నుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.