బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ వేడుక రాజకీయ ప్రసంగాలకు వేదికయింది. దేశ, విదేశాల్లో అత్యున్నత పదవులను అధిరోహించి, పేరుగాంచిన ఎందరో ప్రముఖులు 75 వసంతాల వేడుకకు హాజరయ్యారు. అయితే అనేక వ్యవసాయ పరిశోధనలకు కేంద్రంగా నిలిచిన, సరికొత్త ఆవిష్కరణలకు వేదికైన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఘనతను వేదికపై నుంచి చాటిన అతిథులు ఒక్కరూ లేకపోవడంపై పూర్వ విద్యార్థులు పెదవి విరిచారు. ముఖ్య అతిథులుగా హాజరయిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరుల ప్రసంగాలు సీఎం జగన్ భజనకే పరిమితం కావడంపై పలువురు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏఎన్‌యూ పరిధిలోనిదంటూ సునీత చెప్పడాన్ని పలువురు ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలకు కౌంటర్‌గానా అన్నట్లు సాగిన ఉపకులపతి ఉపన్యాసం కూడా ఆహుతుల్లో చర్చకు దారితీసింది.